డిగ్రీపై నో ఇంట్రెస్ట్​.. అడ్మిషన్లు ముగిసినా 43శాతం సీట్లు కూడా నిండలే    

డిగ్రీపై నో ఇంట్రెస్ట్​.. అడ్మిషన్లు ముగిసినా 43శాతం సీట్లు కూడా నిండలే    
  • 4.5 లక్షల సీట్లకుగాను 1.9లక్షల సీట్లే భర్తీ 
  • అత్యధికంగా బీకామ్​లో 77 వేల మంది చేరిక 
  •  సర్కారు కాలేజీల్లో కాస్త పెరిగిన అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు రాష్ట్ర విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసేనాటికి ఆయా కోర్సుల్లో ఇంకా సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. ఇంటర్ పూర్తయిన స్టూడెంట్లు ఎక్కువ మంది ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఆఫీసర్లు చెప్తున్నారు. పీజీ కోర్సుల్లో మాదిరిగానే డిగ్రీలోనూ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ మంది చేరారు. 

57శాతం సీట్లు భర్తీ కాలేదు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,055 డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిలో 4,57,704 సీట్లున్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికి గాను కేవలం 1,96,442 (42.9%) సీట్లు మాత్రమే నిండాయి. దీంట్లో అమ్మాయిలు 1,05,329 మంది ఉండగా, అబ్బాయిలు 91,113 మంది మాత్రమే ఉన్నారు. మరో 57శాతం సీట్లు భర్తీ కాలేదు. కాగా, ప్రైవేట్​కాలేజీలతో పోలిస్తే ప్రభుత్వ ​కాలేజీల్లోనే అడ్మిషన్లు ఎక్కువ కావడం విశేషం. మొత్తం 160 సర్కారు కాలేజీల్లో 89,337 సీట్లు ఉన్నాయి. వీటిలో 55,361 (61శాతం) సీట్లు భర్తీ అయ్యాయి.   ఇక 816 ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 3,44,793 సీట్లుంటే కేవలం 1,32,388 (38%) సీట్లు మాత్రమే నిండాయి. 

మరోపక్క79 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 23,574 సీట్లకుగానూ 8,693 (36.8%) సీట్లు నిండాయి.  ప్రైవేటు, గురుకులాలతో పోలిస్తే సర్కారు డిగ్రీ కాలేజీలు, వర్సిటీ కాలేజీల్లోనే ఎక్కువ అడ్మిషన్లు అయ్యాయి. ప్రైవేటు కాలేజీల్లో ఏకంగా 64శాతం సీట్లు నిండకపోవడం గమనార్హం. దీంతో రాబోయే సంవత్సరాల్లో పెద్దసంఖ్యలో ప్రైవేట్​ డిగ్రీ కాలేజీలు మూతపడే అవకాశముందని విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. 

గతేడాదితో పోలిస్తే తగ్గినయ్    

డిగ్రీలో గతేడాది 2 లక్షలకుపైగా అడ్మిషన్లు కాగా ఈ సారి కాస్త తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు పెరగ్గా, ప్రైవేటు కాలేజీలు, గురుకులాల్లో తగ్గాయి. పోయినేడు సర్కారు కాలేజీల్లో 53,886 మంది చేరగా, ఈఏడాది 55,361 అడ్మిషన్లు వచ్చాయి.  ప్రైవేటులో గతేడాది 1,41,772 మంది చేరగా, ఈసారి 1.32 లక్షల మంది మాత్రమే చేరారు. గురుకులాల్లోనూ గతేడాది 9వేల అడ్మిషన్లు కాగా.. ఈ ఏడాది 8693కు తగ్గాయి.

బీకామ్​లోనే ఎక్కువ 

డిగ్రీలో  చేరిన విద్యార్థుల్లో ఎక్కువ మంది బీకామ్​ కోర్సులోనే చేరారు. మొత్తం 1.96 లక్షల మంది అడ్మిషన్లు తీసుకోగా, వీరిలో బీకామ్​లో 77,469 మంది, బీఎస్సీ లైఫ్ సైన్స్​లో 36,733 మంది, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్​ 32,181 మంది చేరారు. బీఏలో 28,362 మంది, బీబీఏలో 15,835 మంది, బీసీఏలో 5170, డిప్లొమా కోర్సుల్లో 556, బీబీఎంలో వంద మంది, బీఎస్​డబ్ల్యూలో 25, ఒకేషనల్​లో 11 మంది చేరారు. అయితే, సైన్స్ కోర్సుల కంటే కామర్స్ లో ఎక్కువ మంది విద్యార్థులు చేరడం విశేషం. 

ఎక్కువ మంది ఇంజినీరింగ్​లోనే..

ఇంటర్మీడియెట్​పాసైన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్​లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో డిగ్రీలో చేరేవారి సంఖ్య పడిపోతోంది. ఈ ఏడాది ఇంటర్మీడియెట్​లో  3.90 లక్షల మంది పాస్ కాగా, వీరిలో 25శాతానికి పైగా అంటే సుమారు లక్షకు పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ లో చేరారు. మిగిలిన  1.96 లక్షల మంది డిగ్రీలో చేరగా, మిగిలినవారు ఎంబీబీఎస్​, బీ ఫార్మసీ లాంటి కోర్సుల్లో చేరుతున్నారు.